గోల్డెన్‌ ట్రైయాంగిల్‌...


గోల్డెన్‌ ట్రైయాంగిల్‌... 
కోకాపేట-శంకర్‌పల్లి-ముత్తంగి ప్రాంతాలను కలుపుతూ అభివృద్ధి దూకుడు
భారీ పరిశ్రమలు, ఓఆర్‌ఆర్‌, ఐటీ కారిడార్‌
 ప్రాతిపదికన నానాటికీ పెరుగుతున్న పెట్టుబడులు
హైదరాబాద్‌ వెస్ట్‍ జోన్‌ వైపే అందరి చూపు


గోల్డెన్‌ ట్రయాంగిల్‌... గ్రేటర్‌ శివారులో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులకు ఇదొక అద్బుతమైన ప్రాంతం. ఐటీ కారిడార్‌, ఔటర్‌ రింగు రోడ్డు,భారీ పరిశ్రమలు.. ఇవే  ఆ ప్రాంతానికి సరికొత్త క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. కోకాపేట, శంకర్‌పల్లి, ముత్తంగి ప్రాంతాలను  కలుపుతూ త్రికోణాకారం( ట్రైయాంగిల్‌)లో ఉన్న ఆ ప్రాంతాన్ని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిపుణులు  ప్రస్తుతం గోల్డెన్‌ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్‌ మహానగరం ఒకవైపే అంటే పడమర దిక్కునే ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. దానికి కొనసాగింపు అన్నట్లుగా ఐటీ కారిడార్‌ను కేంద్రంగా చేసుకొని కోకాపేట,శంకర్‌పల్లి,ముత్తంగి ప్రాంతాలను కలిపితే త్రిభుజాకారంలో ఉంటాయి. దీని లోపల ఉన్న ప్రాంతాల్లో భారీ పరిశ్రమలే కాదు, లగ్జరీ గేటెడ్‌  కమ్యూనిటీ నివాస ప్రాంతాలు ఇప్పటికే కొలుపుదీరి ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం ఇంకా వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందంటున్నారు రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు. 

ఒకవైపు ఐటీ కారిడార్‌... మరోవైపు ముంబాయి జాతీయరహదారి... ఇంకోవైపు శంకర్‌పల్లి హైవే... వీటన్నింటికీ కలుపుతూ ఔటర్‌ రింగు రోడ్డు... ఇలా అన్ని  ఒకదానికొకటి కలిసి ఏర్పడిందే గోల్డన్‌ ట్రయాంగిల్‌.  అచ్చ తెలుగులో చెప్పాలంటే బంగారు త్రిభుజం.  పెట్టుబడులకు బంగారు గని చెప్పవచ్చు. త్రిభుజాకారంలో ఉన్న ప్రాంతాలన్నీ ఔటర్‌ రింగు రోడ్డుకు వెలుపలే ఉన్నాయి. అయినా అక్కడ ప్రస్తుతం ఉన్న అభివృద్ధి చూస్తే ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. రూ.1000 కోట్లతో దేశంలోనే అతి పెద్ద  రైల్వే కోచ్‌ ప్యాక్టరీని  ఔటర్‌ రింగురోడ్డును అనుకొని ఉన్న కొల్లూరు పక్కనే కొండకల్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో  మేధ సర్వో కంపెనీ  గతేడాది ఆగస్టులో నిర్మాణం పనులను ప్రారంభించింది. త్వరలోనే ఇక్కడ రైల్వే కోచ్‌లు తయారు చేయనున్నారు. అదేవిధంగా  తెలంగాణ ప్రభుత్వం పేద కోసం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న ఆత్మగౌరవ రెండు పడకల ఇళ్ల నిర్మాణాన్ని ఔటర్‌ రింగు రోడ్డును అనుకొని ఉన్న కొల్లూరులో చేపట్టింది. సుమారు 15000 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఒకో చోట నిర్మాణం జరుపుకోవడం ఒక రికార్డు. త్వరలోనే వీటిని లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇక కోకాపేట ఇప్పుడు ఐటీ కారిడార్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడి నుంచి శంకర్‌పల్లి,ముత్తంగి ప్రాంతాలు కేవలం 15-20 నిమిషాల వ్యవధిలోనే చేరుకునేలా మెరుగైన  రోడ్డు రవాణా సౌకర్యం. ఇక వాటి మధ్యలో ప్రాంతాలన్నీ భారీ పరిశ్రమలకు తోడు నివాస  యోగ్యమైన వెంచర్లతో కూడుకున్నవే  వందల్లో ఉన్నాయి. అంతే కాకుండా ఈ త్రిభుజాకారం మధ్యలో గీత గీస్తే అది  హైదరాబాద్‌- ముంబాయి నగరాన్ని కలిపే రైల్వే మార్గం.  ఈ మార్గంలో ఉన్న ఈదులనాగులపల్లి రైల్వే స్టేషన్‌ను భవిష్యత్తులో శాటిలైట్‌ రైల్వే  టర్మినల్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నారు. ఇలా ఎంతో అభివృద్ధికి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని గోల్డెన్‌ ట్రయాంగిల్‌గా భావిస్తున్నారు పెట్టుబడి దారులు.
కోకాపేట కేంద్రంగా మొదలై...
హైదరాబాద్‌ మహానగరంలో ఐటీ రంగం అభివృద్ధి మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ నుంచి మొదలై  రాయిదుర్గం, కొండాపూర్‌,నానక్‌రాంగూడల మీదుగా గచ్చిబౌలి ఫైనాన్సియల్‌  డిస్ట్రిక్‌ వరకు అక్కడి నుంచి కోకాపేట వరకు విస్తరించింది. ప్రస్తుతం కోకాపేటలో హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన భవనాలు 30 నుంచి  57 అంతస్థులతో నిర్మాణంలో ఉన్నాయి. ఇవే కాకుండా తాజాగా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న  కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను సుమారు 529 ఎకరాల్లో దేశంలోనే అత్యున్నతమైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి  ప్రాంతం నుంచి మొదలయ్యే  గోల్డెన్‌ ట్రయాంగిల్‌ పరిధి గండిపేట-శంకర్‌పల్లి మీదుగా వెళ్లి అక్కడి నుంచి  బీడీఎల్‌ భానూరు (భారత్‌ డైనమిక్స్​​‍) మీదుగా  పటాన్‌చెరువు-ముత్తంగి వద్ద ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు ఇంటర్‌ చేంజ్‌చ వరకు, అక్కడి నుంచి తెల్లాపూర్‌, కొల్లూరుల మధ్య ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా   మళ్లీ  కోకాపేట వద్దకు ఉంటుంది. ఇదంతా ఔటర్‌ రింగురోడ్డు బయట ఉన్న ప్రాంతమే. కొల్లూరులో 2018లో ఎకరం ధరం రూ.3.5 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.12 నుంచి 14 కోట్ల వరకు ఉండగా, గజం ధరం రూ.20 వేల నుంచి 35వేల వరకు పలుకుతోంది. అదే కోకాపేటలో అయితే ఎకరం ధర రూ.40 కోట్ల మాటే. దీన్నే పరిగణలోకి తీసుకొంటూ కోకాపేట వైపు గండిపేట చెరువు ఉండడంతో అక్కడ జీవో 111 అమల్లో ఉండడంతో    ఒకవైపే భవిష్యత్‌ అభివృద్ధికి అవకాశం ఉండడంతో ట్రయాంగిల్‌  ప్రాంతానికి ప్రాధాన్యత నెలకొంది.
కొండకల్‌ వరకు రేడియల్‌ రోడ్డు....
 ట్రయాంగిల్‌ మధ్యలో ఉన్న కొండకల్‌లో కొత్తగా ఏర్పాటవుతున్న మేధ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పక్క నుంచి వికారాబాద్‌ వెళ్లే రైల్వే మార్గం వెంబడి  రేడియల్‌  రోడ్డును ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌ -తెల్లాపూర్‌ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ -ముంబాయి రైల్వే కారిడార్‌ ఇదే ప్రాంతం మీదుగా  వెళుతోంది. వీటికితోడు  ఈ ప్రాంతం నుంచి ఓఆర్‌ఆర్‌తో పాటు ఐటీ కారిడార్‌లోని తెల్లాపూర్‌, గోపన్‌పల్లి, గచ్చిబౌలి, నల్లగండ్ల, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాలకు  వెళ్లేందుకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మంచినీటికి సంబంధించి  జలమండలి ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ  రింగ్‌ మెయిన్‌ను నిర్మిస్తోంది. ప్రస్తుతం  పటాన్‌చెరువు-ముత్తంగి వైపు నుంచి గోదావరి జలాలు కోకాపేట వరకు  వచ్చేలా భారీ పైపులైను నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. ఇలా  రోడ్డు, మంచినీరు వంటి మౌలిక వసతులు మెర్గుగా ఉండడంతో ఈ ప్రాంతానికి పెట్టుబడి దారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.  ఈ ప్రాంతంలో గజం ధర రూ.20వేల నుంచి 30వేల వరకు ఉన్నా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బిల్డర్లు  ఎకరాల స్థలాలను కొనుగోలు చేసి భారీ స్థాయిలో అపార్టుమెంట్లతో గేటెడ్‌ కమ్యూనిటీ  ప్రాజెక్టులు, విల్లా ప్రాజెక్టులు చేపడుతున్నారు.

భవిష్యత్‌ అభివృద్ధి చూసి  పెట్టుబడులు : నవీన్‌ పసునూరు,రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు 
నగరానికి పడరమ దిక్కున ఉన్న  ఐటీ కారిడార్‌ను అనుకొని ఉన్న కోకాపేట,శంకర్‌పల్లి, ముత్తంగి ప్రాంతాల మధ్య అభివృద్ధి గత రెండేళ్లలో శరవేగంగా చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌ దాటిన తర్వాత పదుల సంఖ్యలో గేటెడ్‌ కమ్యూనిటీలు  మోకిల, కొల్లూరు,కొండకల్‌ ప్రాంతాల్లో ఉన్నాయి.వీటితో పాటు భారీ పరిశ్రమలైన మేధ రైల్వే కోచ్‌ ప్యాక్టరీ, రైల్వే గూడ్స్​‍ యార్డ్‍,భారత్‌ డైనమిక్స్​​‍ లిమిటెడ్‌, పాశమైలారం, పటాన్‌చెరువులోని పారిశ్రామిక వాడలు చుట్టూ ఉన్నాయి. అదేవిధంగా కోకాపేట-శంకర్‌పల్లి మార్గంలో ఒకవైపు పూర్తిగా జీవో 111 నిబంధన ఉండడంతో అటు వైపు అభివృద్ధికి అవకాశం చాలా తక్కువగా ఉంది.  ట్రయాంగిల్‌ పరిధిలోనే రెసిడెన్షియల్‌ జోన్‌ ఉంది. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఈ ప్రాంతంలో పరిశ్రమలతో పాటు నివాస ప్రాంతాలు వచ్చేందుకు ఎలాంటి  పరిమితులు లేవు. దీంతో పటాన్‌చెరువు, ముత్తంగి,భానూర ప్రాంతాల వైపే అటు నివాస ప్రాంతాలు, ఇటు పరిశ్రమలు ఏర్పాటవుతూనే ఉన్నాయి.  దీంతో  ఈ ప్రాంతం గోల్డెన్‌  ట్రయాంగిల్‌ కాదు భవిష్యత్తులో  డైమండ్‌ ట్రయాంగిల్‌గా మారే అవకాశం ఉంది.











Comments

Popular posts from this blog

Real Estate PE Investments Log 40% Annual Rise in 1H FY23 - ANAROCK Capital

Minister KTR holds meeting on preparations for Hyd Metro Rail Phase-II foundation stone laying ceremony

*అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన : రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు*